నాగులవంచ రైతు వేదికలో ఇన్పుట్ డీలర్ల సమావేశం

చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలి : సహాయ వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర

పయనించే సూర్యుడు మే 28, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలోని నాగులవంచ రైతు వేదికలో చింతకాని, బోనకల్ మండలాల ఇన్పుట్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. విజయచంద్ర, చింతకాని ఎస్సై వీరేందర్ హాజరై డీలర్లకు పలు సూచనలు చేశారు. విత్తన చట్టం, పురుగుమందుల చట్టం, ఎరువుల చట్టాలకు లోబడి వ్యాపారం నిర్వహించాలని డీలర్లను ఆదేశించారు. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, గుర్తింపు పొందిన కంపెనీల నుంచే విత్తనాలను తెప్పించి విక్రయించాలని సూచించారు. విత్తనాలకు సంబంధించిన ఇన్వాయిసులు, ప్రిన్సిపాల్ సర్టిఫికె ట్లు, గ్రో అవుట్ రిజల్ట్స్ తప్పనిసరిగా దుకాణాలలో ఉంచుకోవాలని తెలిపారు. స్టాక్ రిజిస్టర్‌లను ప్రతిరోజూ అప్డేట్ చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు విత్తన స్టాక్ రిపోర్టును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. రైతులకు అమ్మే విత్తనాల గుణగణాలను స్పష్టంగా వివరించి, సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని కోరారు. ఎరువులకు సంబంధించిన ఓ-ఫార్ములు, పురుగుమందులకు సంబంధించిన ప్రిన్సిపాల్ సర్టిఫికెట్లు లైసెన్సుల్లో పొందుపరచుకోవాలని తెలిపారు. గడువు ముగిసిన స్టాక్‌ను ప్రత్యేకంగా ఉంచి “నాట్ ఫర్ సేల్” బోర్డు ప్రదర్శించాలని సూచించారు. అలాగే లైసెన్సులను అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించడంతో పాటు స్టాక్ బోర్డులను ప్రతిరోజూ నవీకరించాలని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మాత్రమే సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతకాని వ్యవసాయ అధికారి సోములపల్లి మానస, బోనకల్ వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు కళ్యాణి, తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *