పోలవరం బ్యాక్‌వాటర్ బాధితులకు న్యాయం చేయాలి

* ప్రభావిత గ్రామాల రక్షణకు కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలి : * సిడబ్ల్యుసి( పోలవరం ప్రాజెక్టు అథారిటీ) కి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి పత్రం అందజేత..

పయనించే సూర్యుడు ,జూన్ 05,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని గ్రామాలు, వ్యవసాయ భూములు, ప్రజల జీవనోపాధి మరియు మౌలిక సదుపాయాలకు ఏర్పడుతున్న ముప్పుపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ( పిపిఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యూసి) అధికారులకు సమగ్ర వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బూర్గంపాడు, అశ్వాపురం మండలాలతో పాటు నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం తదితర గ్రామాలు పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో తీవ్ర ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అధికారిక అంచనాల కంటే వాస్తవ పరిస్థితుల్లో మరింత విస్తీర్ణంలో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వందలాది కుటుంబాలు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.గోదావరి వరదల సమయంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసే ప్రమాదం ఉందన్నారు. వాగులు, ఉపవాగులు, సహజ నీటి పారుదల మార్గాలపై బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల నీటి నిల్వ సమస్యలు పెరిగి వ్యవసాయం, గ్రామీణ జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. అశ్వాపురంలో భారత దేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన హెవీ వాటర్ ప్లాంట్ భద్రతకు కూడా భవిష్యత్తులో ముప్పు వాటిల్లే అవకాశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రభావిత గ్రామాల్లో సమగ్ర శాస్త్రీయ బ్యాక్‌వాటర్ సర్వే నిర్వహించడం, ప్రత్యేక పునరావాస మరియు పునర్నిర్మాణ ప్యాకేజీ ప్రకటించడం, భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించడం, ఉపనదులపై బ్యాక్‌వాటర్ ప్రభావ అధ్యయనం చేపట్టడం, శాశ్వత వరద నియంత్రణ చర్యలు అమలు చేయడం, రక్షణ కరకట్టలు మరియు ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించడం వంటి పది ప్రధాన డిమాండ్లను వినతిపత్రంలో పేర్కొన్నట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు, నిపుణులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించాలని, ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నైనా శాస్త్రీయ అధ్యయనం, ప్రజాభిప్రాయం, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు లేకుండా అమలు చేయరాదని స్పష్టం చేశారు.పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మరియు సంబంధిత అధికారులు అత్యవసర చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *