పయనించే సూర్యుడు, జూన్ 16, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, వేపలగడ్డ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణ పనులు మూడేళ్లుగా అసంపూర్తిగా ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మర్రికుంట ప్రధాన రహదారి నుంచి వేపలగడ్డ కొమ్మునకిరిపేట వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర రూ.2 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ, కాంట్రాక్టర్ మిడ్డిమిక్స్ వేసి పనులను మధ్యలోనే నిలిపివేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.రోడ్డు పనులు నిలిచిపోవడంతో వేపలగడ్డ, పరిసర గిరిజన గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారి ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు గ్రామానికి చేరుకోలేని దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. మిడ్డిమిక్స్ మాత్రమే వేసి వదిలేయడంతో ధూళి కాలుష్యం అధికమై ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సమస్యపై పలుమార్లు మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు వాపోయారు. రూ.2 కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రారంభించిన పనులు ఎందుకు నిలిచిపోయాయో సంబంధిత అధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ పీవో కి వినతి పత్రం అందజేసి డిమాండ్ చేశారు. గిరిజనులు అధికంగా నివసించే ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి, అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వేపలగడ్డ గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.”ప్రజాధనం ఖర్చు చేసి ప్రారంభించిన అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోవడం బాధాకరం. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి” అని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.