పయనించే సూర్యుడు మే 26 మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో భూదందా కలకలం రేపుతోంది. కోర్టు స్టే ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా కబ్జాదారులు దౌర్జన్యానికి దిగారు. నాగారం రాంపల్లిలోని సర్వేనెంబర్ 406 లో ఉన్న భూమిని రౌడీ మూకలతో కలిసి కబ్జా చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా.. ప్రశ్నించిన బాధితులపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. జేసీబీలతో భూమిని చదును చేస్తూ.. అడ్డువచ్చిన వారిపై ప్రతాపం చూపించారు. బాధితుల వివరాలు ప్రకారం..ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఐదవ డివిజన్ నాగారం రాంపల్లిలో భూవివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. సర్వే నెంబర్ 406 లో తమ భూమిని కొందరు దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 లో తాము ఆండాలు అనే వ్యక్తి వద్ద ఈ స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశామని బాధితురాలు పేర్కొంటున్నారు. అయితే గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు వచ్చి.. ఇది తమ ల్యాండ్ అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై బాధితులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సదరు స్థలంపై స్టే ఆర్డర్ కూడా జారీ చేసింది. కోర్టు స్టే ఆర్డర్ అమల్లో ఉన్నప్పటికీ.. కబ్జాదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పదే పదే రౌడీ మూకలను తీసుకువస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఏకంగా వివాదాస్పద స్థలంలో టెంట్ వేసుకొని, జేసీబీ సహాయంతో భూమిని లెవెల్ చేయడం ప్రారంభించారు. దీనిని గమనించిన బాధితురాలి భర్త అక్కడకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సుమారు 20 మంది రౌడీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. దౌర్జన్యంగా ఆయన మొబైల్ ఫోన్ లాక్కొని, తీవ్రంగా కొట్టి, అక్కడి నుంచి నెట్టివేశారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. రౌడీయిజంతో తమను భయభ్రాంతులకు గురిచేస్తూ, భూమిని లాక్కోవాలని చూస్తున్న కబ్జాదారులపై రాచకొండ సీపీ తక్షణమే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని.. తమకు ప్రాణరక్షణ కల్పించి, న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.