పయనించే సూర్యుడు మే 25, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: జాతీయ రహదారి ముదిరెడ్డి పల్లి నుండి రాయపల్లి గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి ప్రస్తుతం వాహనదారులకు నరకప్రాయంగా మారింది. స్థానిక ప్రాంతంలో నడుస్తున్న ఆర్.ఎమ్.సి కంకర మిషన్ వాహనాల రాకపోకలతో రోడ్డు పూర్తిగా దెబ్బతిని, రోడ్డు మీద కంకర పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం బాటసారులు, వాహనదారులు నడిచే ఈ మార్గంలో ఆర్.ఎమ్.సి కంకర మిషన్ కి సంబంధించిన భారీ వాహనాలు నడవడంతో రోడ్డుపై భారీగా కంకర తేలిపోయింది. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు నిత్యం జారిపడే ప్రమాదం ఉంది. రోడ్డుపై కంకర గాలికి ఎగిరి పడటం, టైర్ల కింద పడి వాహనాలు స్కిడ్ అవ్వడం వల్ల ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది. ఆర్.ఎమ్.సి వాహనాల యజమానులు ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ వాహనాలు నడపడం వల్లే రోడ్డు ఈ దుస్థితికి చేరుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు , రాయపల్లి సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ , స్థానిక వార్డు మెంబర్లు ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. రహదారిని పునరుద్ధరించాలని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును పాడు చేస్తున్న భారీ వాహనాలపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.