వ్యవసాయ అప్పుల భారం. రైతు మృతి.

అప్పులు ఇచ్చిన వారి వేధింపులే కారణమని భార్య ఫిర్యాదు – విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులను కోరిన బాధితురాలు
🖨️ Print

పయనించే సూర్యుడు, నవంబర్ 3, బచ్చన్నపేట మండలం ప్రతినిధి: నీల పవన్. వ్యవసాయంలో వరుస నష్టాలు, అప్పుల భారం, అప్పులు ఇచ్చిన వారి వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన రైతు మృతి చెందిన ఘటన బచ్చన్నపేట మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య వేముల స్వప్న బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ గౌడ్ గత మూడేళ్లుగా తమకున్న నాలుగు ఎకరాల సొంత భూమితో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్న ఆయన ఉద్యమ నిర్వహణ కోసం చేసిన అప్పులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనంతరం వ్యవసాయం ద్వారా అప్పులు తీర్చాలని ప్రయత్నించినప్పటికీ పంటలు ఆశించిన దిగుబడి, ఆదాయం ఇవ్వకపోవడంతో అప్పులు మరింత పెరిగాయి. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో పాటు పలువురి వద్ద అప్పులు చేసినట్లు భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆలింపూర్ గ్రామానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి అప్పు చెల్లించాలని ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ గొడవ చేసినట్లు ఆమె ఆరోపించారు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో తన భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తెలిపారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన లక్ష్మణ్ గౌడ్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా, పొలం వద్ద మృతి చెందినట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న తన భర్త అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇచ్చిన వారి వేధింపుల నేపథ్యంలో మృతి చెందాడని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని స్వప్న పోలీసులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *