పయనించే సూర్యుడు జూన్ 04 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా, హాన్వాడ మండలం టంకర గ్రామం ఎస్సీ కాలనీలో మురుగు కాలువలు పూర్తిగా చెత్తాచెదారంతో, పిచ్చి మొక్కలతో నిండిపోయి దర్శనం ఇస్తున్నాయి. కాలువల్లో నీరు నిలవడం వల్ల దోమలు , ఈగలు వాలి స్థానికులు తీవ్రమైన అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని , కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన వస్తోందని, నిత్యం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు బి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి అపరిశుభ్రత ఉన్న స్థానిక సర్పంచ్, వార్డు మెంబర్లు ఈ సమస్యను అస్సలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కనీస సౌకర్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాలువలు ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో వర్షపు నీరు బయటకు వెళ్లక మురుగు నీరు రోడ్లపైకి చేరి పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. అప్పుడు వ్యాధుల తీవ్రత మరింత పెరుగుతుందని ఎస్సీ కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే మురుగు కాలువలను శుభ్రం చేయించాలని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని బి శ్రీనివాస్ తో పాటు కాలనీ ప్రజలు కోరుతున్నారు.