పయనించే సూర్యుడు న్యూస్ జూలై 3 సాలూర : మన ఊరు భద్రత బాధ్యతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతైనా అవసరం ఉందని బోధన్ రూరల్ ఠాణా ఎస్హెచ్ఓ ఎం.రాజశేఖర్ అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం సాలూర మండలం తగ్గేల్లీ గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు,రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ఎస్ హెచ్ ఓ పిలుపునిచ్చారు.సైబర్ నేరాలు,ఓటీపీ,బ్యాంకు ఖాతా,యూపీఐ,పిన్ పాస్ వార్డులు రహస్యంగా ఉంచుకుంటూ ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.సైబర్ మోసాలకు గురి అయిన వెంటనే 1930కి కాల్ చేసి పోలీసులను సంప్రదించవలసిందిగా ఎస్హెచ్ఓ పేర్కొన్నారు.రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని సూచించారు.కారు నడిపే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు.అధిక వేగాన్ని నివారించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని జాగ్రత్తలు పాటించాలని కోరారు.విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏవైనా విద్యుత్ లోపాలు కనిపించినట్లయితే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. వ ర్షాకాలంలో చల్లటి వాతావరణానికి విష సర్పాలు సంచరిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.ఇండ్ల చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రాత్రివేళ బయటకు వెళ్లే సమయంలో టార్చ్ లైట్ లు వినియోగించుకోవాలని తెలిపారు.పాము కాటుకు గురైతే మూడో నమ్మకాలను నమ్మకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని కోరారు.మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడు మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించుకోవడం సాధ్యమవుతుందన్నారు.అక్రమ మద్యం,నిషేధిత మత్తు పదార్థాలను క్రయవిక్రయాలు ఎవరైనా చేసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు చట్ట విరుద్ధ కార్యకలాపాలు లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే సంఘటనలు చోటుచేసుకున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.సమాచారం సేరవేసినప్పుడే సమస్యలను పరిష్కరించడం సులభతరం అవడంతో పాటు సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ హెచ్ ఓ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పోలీసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.