వర్షాకాలం నేపథ్యంలో రావోజి తండాలో ప్రత్యేక డ్రై డే కార్యక్రమం

నీరు నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన

పయనించే సూర్యుడు న్యూస్ జులై 4 సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మండల పరిధిలోని రావోజి తండా గ్రామపంచాయతీలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక.డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెందకుండా, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను నివారించేందుకు గ్రామ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇళ్ల పరిసరాలు, ఖాళీ స్థలాలు, నీటి ట్యాంకులు, కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర ప్రాంతాలను పరిశీలించి ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. అలాగే ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ నీటి నిల్వలను తొలగించాలని, దోమల పెరుగుదలకు అవకాశం ఇవ్వకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి, ఏవైనా జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐకేపీ వీవోఏలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు కూడా కార్యక్రమానికి సహకరిస్తూ పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *