శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయంలో 77 రోజుల హుండీ ఆదాయం రూ.65.89 లక్షలు

పయనించే సూర్యుడు జూలై 4. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మఠం వీరేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మెదక్ జిల్లా ఇన్‌స్పెక్టర్ రంగారావు, మెదక్ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొని హుండీ లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. .

.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత 77 రోజుల కాలానికి గాను హుండీ ద్వారా మొత్తం రూ.65,89,200 నగదు ఆదాయం లభించింది. భక్తులు సమర్పించిన కానుకల్లో మిశ్రమ బంగారం 38 గ్రాములు, మిశ్రమ వెండి 1.230 కిలోగ్రాములు (1,230 గ్రాములు) కూడా లభించాయి.

.

ఏడుపాయల అమ్మవారిపై భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసానికి ఈ హుండీ ఆదాయం నిదర్శనమని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను నిబంధనల ప్రకారం నమోదు చేసి లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, పాపన్నపేట పోలీసు సిబ్బంది, శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, స్వచ్ఛంద సేవకులు తదితరులు పాల్గొన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

.

రిపోర్టర్: పుంటికూర దుర్గేష్ గౌడ్

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *