పయనించే సూర్యుడు జులై 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా పంపిణీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాను సకాలంలో, పారదర్శకంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. యూరియా పంపిణీ కేంద్రంలో రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్హ రైతుకూ బయోమెట్రిక్, ఆన్‌లైన్ నమోదు విధానంలో ఎరువులు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని, రైతుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మండలంలో ప్రస్తుతం 244 టన్నుల యూరియా నిల్వలు ఉండగా, బిజినపల్లి సహకార సంఘంలో 62 టన్నుల నిల్వ అందుబాటులో ఉందని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అదనపు నిల్వలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగుకు బదులుగా జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయల సాగును రైతులు చేపట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, నీటి యాజమాన్యం, ఎరువుల సమర్థ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్‌లో బిజినపల్లి మండలంలో 12,345 ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, ఇప్పటివరకు 31 ఎకరాల్లో వరి, 45 ఎకరాల్లో మొక్కజొన్న, 79 ఎకరాల్లో ఇతర పంటల సాగు ప్రారంభమైనట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో మండల ఎమ్మార్వో మునీరుద్దీన్ గ్రామ సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మిద్దె రాములు కత్తె ఈశ్వర్ స్థానిక నాయకులు మండల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు