పయనించే సూర్యుడు జులై 08 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి: ఉట్నూర్ మండల కేంద్రం లో పాత ఉట్నూర్ విధి లో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వారికి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అలాగే గ్రామంలోని మురికి కాలువల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు, క్రిమికీటకాలు పెరిగే అవకాశముందని గుర్తించి, డ్రైనేజీల్లో యాంటీ లార్వా మందులు పిచికారీ చేసి నివారణ చర్యలు చేపట్టారు డాక్టర్. శ్రీనివాస్ (ఎంబిబిఎస్) మాట్లాడుతూ.. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. జ్వరం రెండు రోజులకుపైగా కొనసాగినా, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, వాంతులు, నీరసం లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలి. స్వయంగా మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి వాడడం ప్రమాదకరం. వైద్యుల సూచనల మేరకే చికిత్స తీసుకోవాలి. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి కుటుంబం ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు వియలక్ష్మి (ఏయన్ఎం ) మాట్లాడుతూ.. ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి కుటుంబ బాధ్యత. తాగునీటిని తప్పనిసరిగా మరిగించి లేదా గోరువెచ్చగా చేసుకుని మాత్రమే తాగాలి. ఆహారాన్ని మూతపెట్టి ఉంచాలి ఇంటి చుట్టూ కొబ్బరి చిప్పలు, టైర్లు, కుండీలు, డబ్బాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల నివారణకు దోమతెరలు ఉపయోగించాలి. చిన్నపిల్లలకు జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి” అని ప్రజలకు వివరించారు ప్రతీప్ (మలేరియా విభాగం) మాట్లాడుతూ. మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల నివారణలో ప్రజల సహకారం చాలా అవసరం దోమలు పెరిగే ప్రాంతాలను గుర్తించి వెంటనే సమాచారం ఇవ్వాలి డ్రైనేజీలు, మురుగు కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో యాంటీ లార్వా మందులు వేయడం జరుగుతోంది. ప్రజలు కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే దోమల వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చు. జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తి రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చు అని తెలిపారు. ఆశా వర్కర్ ముంజం సత్యవ్వ మాట్లాడుతూ.. “గ్రామ ప్రజలు ఎవరైనా జ్వరం, దగ్గు, జలుబు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడితే వెంటనే ఆశా వర్కర్ లేదా వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. ఇంట్లోనే ఉండి ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. ప్రతి కుటుంబం ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని, పిల్లలు మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలి అవసరమైతే ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సేవలు అందించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము అని అన్నారు ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ 15వ వార్డు సభ్యురాలు దాసండ్ల కళావతి మాట్లాడుతూ. ప్రజల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత వర్షాకాలంలో పరిశుభ్రత పాటిస్తే అనేక వ్యాధులను నివారించవచ్చు గ్రామంలోని డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడం నిరంతరం కొనసాగుతుంది ప్రతి కుటుంబం గ్రామ పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలని గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అలాగే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించారు. గ్రామంలో పరిశుభ్రత, దోమల నివారణ, సురక్షిత తాగునీరు, వ్యక్తిగత పరిశుభ్రత, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం వంటి అంశాలపై ప్రజలకు సలహాలు, సూచనలు అందించారు.