పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26 వేల కనీస వేతనం నిర్ణయించాలి

- సీఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జె.చంద్రశేఖర్ డిమాండ్ - ముఖ్యమంత్రి ప్రకటించిన పెంపుపై సీఐటీయూ అసంతృప్తి

పయనించే సూర్యడు / మే 22 / ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లేదని, పెరిగిన ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా కనీస వేతనాలను పెంచాలని సీఐటీయూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు జె.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల అభిప్రాయాలు, కనీస వేతనాల సలహా మండలి సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ పరిధిలోని షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాల పెంపును ప్రకటించడం, దాదాపు 14 సంవత్సరాల తర్వాత చేసిన ఈ సవరణ కార్మికుల ఆశలను నెరవేర్చలేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. జూన్ 2, 2026 నుంచి సవరించిన వేతనాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కోటి మందికిపైగా కార్మికులకు నిజమైన ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు లేవన్నారు. రాష్ట్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలుగా మూడు జోన్లుగా విభజించి వేతనాలు వేర్వేరుగా నిర్ణయించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా అన్ని రంగాలకు ఒకే తరహాలో నాలుగు కేటగిరీలుగా విభజించి వేతనాలు నిర్ణయించడం వల్ల వివిధ పనుల స్వభావానికి అనుగుణంగా ఉన్న వేతన వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం అన్‌స్కిల్డ్ కార్మికుడికి రూ.16 వేలు, సెమీ స్కిల్డ్‌కు రూ.17 వేలు, స్కిల్డ్‌కు రూ.18,500, హైస్కిల్డ్‌కు రూ.20 వేలు నిర్ణయించినప్పటికీ, ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులు పొందుతున్న వేతనాలతో పోలిస్తే పెద్దగా పెరుగుదల లేదన్నారు. కొన్ని కేటగిరీల్లో ప్రస్తుతం అమలులో ఉన్న జీవో నెం.4 కంటే తక్కువ వేతనాలు ప్రకటించారని విమర్శించారు. స్కిల్డ్ కార్మికుడికి ప్రస్తుతం రూ.19,572 వేతనం ఉండగా, కొత్త ప్రకటనలో రూ.18,500 మాత్రమే నిర్ణయించడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని శాస్త్రీయంగా లెక్కిస్తే కనీస వేతనం రూ.32 వేలకు చేరుతుందని తెలిపారు. అయినప్పటికీ కార్మిక సంఘాలు రాజీగా రూ.26 వేల కనీస వేతనం కోరుతున్నాయని చెప్పారు. కార్మిక సంఘాలు, కనీస వేతనాల సలహా మండలి సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ప్రకటించిన వేతనాలను సవరించాలని సీఐటీయూ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు జె.చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *