ఏడుపాయల చెక్‌డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం.

పయనించే సూర్యుడు మే 26. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల చెక్‌డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు 25 సంవత్సరాల వయస్సు గల ఓ యువకుడు ఫ్రెంచ్‌కట్ గడ్డంతో, రెండు జతల బట్టలున్న బ్యాగుతో ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం కోసం వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం చెక్‌డ్యాం వద్ద స్నానం చేయడానికి నీటిలోకి దిగిన యు వకుడు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు సమాచారం. చెక్‌డ్యాం ఒడ్డున బట్టలు, బ్యాగు కనిపించడంతో అనుమానం చెందిన స్థానికులు వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గజఈతగాళ్ల సహాయంతో నీటిలో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఎలాంటి వివరాలు లభించలేదు. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి ఫోటో ఆధారంగా ఎవరైనా గుర్తిస్తే పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ (87126 57920), మెదక్ రూరల్ సీఐ జార్జ్ (87126 57916)లను సంప్రదించాలని పోలీసులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *