తిరుమలకుంటలో అంబరాన్నంటిన ఆదివాసుల ‘భూమి పండుగ’

* తిరుమలకుంటలో వైభవంగా భూదేవి ఉత్సవాలు * ప్రకృతిని, నమ్ముకున్న నేలను పూజించిన గిరిజనులు * వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు * సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలతో మార్మోగిన గిరిజన పల్లె

పయనించే సూర్యుడు న్యూస్ మే 26 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట తెలంగాణం ఆదివాసుల విశిష్ట సంస్కృతీ సంప్రదాయాలకు, వారి జీవన విధానానికి అద్దం పట్టేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీలో “భూమి పండుగ” (భూదేవి పండుగ) సోమవారం అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగింది. ఏటా రుతుపవనాలు రాకముందే కొత్త వ్యవసాయ సీజన్ ప్రారంభానికి సంకేతంగా గిరిజనులు ఈ పండుగను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. తాము సాగు చేసే భూతల్లిని పూజించిన తర్వాతే నాగలి పడతారనే గాఢమైన నమ్మకం వీరి సొంతం. ఈ ఏడాది కూడా వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని, సాగు పనులు లాభసాటిగా సాగాలని, గ్రామంలో ఎలాంటి విపత్తులు రాకుండా ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు గ్రామ సర్పంచ్ కోర్స రాజేష్, గ్రామ పెద్దలు నారాం బొంజారావు, మోడియం వీరేశ్వరావుల ఆధ్వర్యంలో ఉదయాన్నే పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పొలిమేరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో గిరిజన పూజారులు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూమిని తవ్వి అందులో నైవేద్యాలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాబోయే పంటకాలానికి ఉపయోగించే విత్తనాలకు పూజలు చేసి వాటిని పొలాల్లో చల్లేందుకు సిద్ధం చేశారు. గిరిజన నృత్యాలు.. రేలా రేలా పాటల కోలాహలం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు నిలిచాయి. మహిళలు, యువతులు తమ సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వలయాకారంగా తిరుగుతూ ‘రేలా రేలా’ పాటలకు స్టెప్పులేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ కలిసి నృత్యాలు చేయడంతో తిరుమలకుంట గ్రామం పులకించిపోయింది. పురుషులు కూడా తమ సాంప్రదాయ వాయిద్యాలను వాయిస్తూ బాణాలు విల్లంబులు ధరించి నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ప్రకృతిని దైవంగా భావించే జీవనశైలి ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నారం పోత్తయ్య మడకం ముత్యాలరావు మోడియం రమేష్ మాట్లాడుతూ మా ఆదివాసుల జీవితం ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. అడవిని, భూమిని మేము దైవంగా భావిస్తాం. భూదేవిని సంతోషపరిస్తేనే మాకు తిండి దొరుకుతుందని మా నమ్మకం. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని నేటి తరం యువత కూడా గౌరవిస్తూ పండుగను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, మానవునికి ప్రకృతికి ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీక అని వారు చాటిచెప్పారు. అడవికి వేట సామూహిక విందు భూమి పూజ ముగిసిన అనంతరం ఆదివాసి సంప్రదాయం ప్రకారం గ్రామస్తులంతా కలిసి అడవికి వేటకు వెళ్లడం, అనంతరం తెచ్చిన ప్రసాదాలను, నైవేద్యాలను గ్రామస్తులంతా సామూహికంగా పంచుకుని విందు ఆరగించడం ఈ పండుగలో ప్రత్యేకతగా నిలిచింది. ఈ వైభవ వేడుకల్లో గ్రామ ప్రముఖులు కోర్స ముత్యాలరావు పొట్ట నాగేంద్ర మోడియం పుల్లప్ప మాడి రమేష్ మోడియం శ్రీను కోర్స జోగారావులతో పాటు స్థానిక రైతులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను జయప్రదం చేశారు పండుగ సంబరాలతో తిరుమలకుంట గ్రామంలో పల్లె అందాలు ఆదివాసి సంస్కృతి ఉట్టిపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *