జమ్మికుంటలో రెండు వేర్వేరు కేసులు నమోదు

* దాడి ఘటనలో యువకుడికి గాయాలు.. * గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తి మృతి

జనం న్యూస్ , జూన్ 7 ( జిల్లా ఇంచార్జ్ ) జమ్మికుంట పట్టణ పరిధిలో శుక్రవారం రెండు వేర్వేరు ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు. మొదటి ఘటనలో మోతుకులగూడెం గ్రామానికి చెందిన ఇల్లందుల అంజి (23) తన ఇంటి వద్దకు వచ్చేసరికి డబ్బుల వ్యవహారంపై గతంలో ఉన్న మనస్పర్థల కారణంగా తన పెద్దనాన్న కుమారుడు ఇల్లందుల అనిల్ (18) తనను దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ప్రశ్నించగా అనిల్ తన వద్ద ఉన్న కత్తెరతో భుజం, వీపు భాగం, ఎడమ చేతిపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిపాడు. గొడవను ఆపేందుకు వచ్చిన అంజి తండ్రి సమ్మయ్యను కూడా నెట్టివేయడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు అరుణ్, గుల్లి సాయితేజ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొనగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించమని తెలిపారు. మరో ఘటనలో జమ్మికుంటకు చెందిన ఆడెపు లక్ష్మణ్ (46) అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన గత ఎనిమిదేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. జూన్ 5న వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యుల సలహా మేరకు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు వెళ్లాలని సూచించినప్పటికీ, రాత్రి కావడంతో ఇంటికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఆడెపు కావ్య తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదులో పేర్కొనగా, అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రెండు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *