
పయనించే సూర్యుడు నవంబర్ 03,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు ). చింతకాని, నవంబర్ 2: చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ చింతకాని మండల సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి మాట్లాడుతూ..మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను బోనకల్ బ్రాంచ్ కాలువ ద్వారా చెరువులు, కుంటలకు మళ్లించి నీటితో నింపాలని, రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, యూరియా యాప్ను రద్దు చేయాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచి ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, గతంలో దళితబంధు పథకం కింద మంజూరైన రూ.15.50 కోట్లను 155 దళిత కుటుంబాలకు వెంటనే అందించాలని కోరారు. 3,800 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇవ్వాలని, విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రోడ్డు విస్తరణతో ఇళ్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండపర్తి గోవిందరావు మాట్లాడుతూ..వెంకటాయపాలెం నుంచి కొదుమూరు వరకు ఉన్న 100 అడుగుల రహదారి విస్తరణను గ్రామాల్లో 50 అడుగులకు పరిమితం చేసి, ప్రజల ఇళ్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నమండవ గ్రామంలో మున్నేరు నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.అనంతరం 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కరుణశ్రీకి అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు, జిల్లా సమితి సభ్యులు, చిన్నమండవ సర్పంచ్ పర్స రామచంద్రరావు, పావులూరి మల్లికార్జున్, కూచిపూడి రవి, పార్టీ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, నారపోగు హేమ, మండల సహాయ కార్యదర్శులు మార్గం శ్రీను, అబ్బూరి ఉమామహేశ్వరరావు, బసవపురం సర్పంచ్ ఆవుల నరసింహారావు, నాయకులు పగిడిపల్లి ఏసు, దొబ్బల వెంగళరావు, పదిమల్ల వెంకట నరసయ్య, గోగుల ఆది, గోగుల వెంకట్, హుస్సేన్, గుండ్ల బేబీ రాణి, తుపాకుల లక్ష్మీనారాయణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.