పయనించే సూర్యుడు, మే 31 దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ, టౌన్ న్యూస్, మహిళల సాధికారికతకు కృషి చేయడమే కాకుండా వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలిచేందుకు ప్రభుత్వం జెండర్ రిసోర్స్ సెంటర్లను చేపడుతుందని డిఆర్ డిఓ పిడి శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 99 రోజుల ప్ర ప్రణాళికలో భాగంగా ప్రజా పాలన ప్రగతి నివేదిక సందర్భంగా డిఆర్డిఏ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ( సెర్ప్ )ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కుటుంబ సలహా కేంద్రం( జెండర్ రిసోర్స్ సెంటర్) ను దేవరకొండ పట్టణంలో మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శనివారం ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలు, సమాజంలో చోటు చేసుకుంటున్న పలు ఘటనాలతో అతివలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కలత చెందడం మినహా ఎవరికి చెప్పుకోలేక వారిలో వారే కుమిలిపోయి మానసికంగా కుంగి పోతున్నారని తెలిపారు. ఇలాంటి వారందరికీ జెండర్ రిసోర్స్ సెంటర్ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సమాజంలోని స్త్రీలు ఎవరైనా సరే ఈ కేంద్రాన్ని ఆశ్రయించి సాయం పొందవచ్చునని అన్నారు. అన్యాయానికి గురైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యకు పరిష్కారం లభించే విధంగా సహకారం అందిస్తారని వివరించారు. కుటుంబ సమస్యలు, మహిళల హక్కులు, లింగ వివక్ష, గృహహింస, ఆరోగ్యం, పోషకాహారం పై ఉచితంగా న్యాయ, మానసిక సలహాలు అందించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని తెలిపారు, బాధితులు నేరుగా వచ్చి సేవలు పొందవచ్చునని సూచించారు. అలాగే 72 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు. అనంతరం జెండర్ కమిటీ సభ్యులను, మండల సమాఖ్య ఓబీలను, వివో ఏ లను సన్మానించారు. అంతకుముందు స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి కోదాడ జడ్చర్ల జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దానియేలు, సీఐ వెంకట్ రెడ్డి, సెర్ప్ పీఎం లింగం గౌడ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి, ఏపీఎం విజయలక్ష్మి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొర్ర రామ్ సింగ్ నాయక్, సిడిపిఓ చంద్రకళ, సీసీలు, జెండర్ కమిటీ సభ్యులు, వివో ఏలు, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.