పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 4:( సింగరేణి రిపోర్టర్ నరేష్ ) రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఆరోపించారు. కారేపల్లి మండలం ఎర్రబోడులో రైతు సంఘం సమావేశం మండల అధ్యక్షుడు ముండ్ల ఏకాంబరం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న విద్యుత్ బిల్లును దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బిల్లును సవరణల పేరుతో రాష్ట్రాలపై రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీనికి ప్రతిఫలంగా రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నార్తర్న్, సౌతర్న్ విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు “రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ” పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దాని వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని ఆరోపించారు. రైతుల విద్యుత్ కనెక్షన్లను ప్రత్యేక సంస్థకు బదిలీ చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న పంపిణీ సంస్థలకు లాభాలు చూపించి, వాటిని తాకట్టు పెట్టి అప్పులు పొందే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అలాగే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ప్రతి స్మార్ట్ మీటర్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1,400 చొప్పున నిధులు అందించనున్నట్లు తెలిపారు. ఇండ్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల వద్ద కూడా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నారని, ఇది విద్యుత్ రంగ ప్రైవేటీకరణలో భాగమేనని విమర్శించారు. మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బస్తాల కొరత, లారీల సమస్య, గోదాముల కొరత, అకాల వర్షాల కారణంగా అనేక కష్టాలు పడిన తర్వాత ప్రభుత్వానికి పంటను విక్రయించారని చెప్పారు. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న డబ్బులతో పాటు రైతు భరోసా నిధులను కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు. రైతు సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలు, పోరాటాల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు, నాయకులు తుమ్మోజు రామమూర్తి, పాపినేని నాగేశ్వరరావు, భాగం వెంకటప్పారావు, ఎస్.కే. సైదులు, తమ్మినేని ముత్తయ్య, వల్లభినేని మురళి, పాసిన్ని నాగేశ్వరరావు, అన్నారపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.