పయని0చే సూర్యుడు జూన్ 4 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం గోకులకృష్ణ కాలేజీ నుంచి టోల్‌గేట్ వరకు జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న విద్యుత్ వైర్లపై చెట్లు, పొదలు విపరీతంగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ తీగలను పూర్తిగా తాకే స్థాయిలో చెట్ల కొమ్మలు విస్తరించడంతో ఎప్పుడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలోనే తరచూ విద్యుత్ కోతలు ఎదురవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. రానున్న వర్షాకాలంలో గాలులు, వర్షాల కారణంగా చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడితే భారీ విద్యుత్ అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్లు జరిగి ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. జాతీయ రహదారి వెంట ఇలాంటి పరిస్థితులు ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లు, పొదలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.