పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రపంచ దేశాలపై, ప్రపంచ మార్కెట్లపై ఆధిపత్యం సాధించడానికే సామ్రాజ్యవాద దేశాలు యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాయని, సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్ అన్నారు. జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల్లో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన “సామ్రాజ్యవాద దోపిడీ” అంశంపై తరగతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, ప్రపంచ మార్కెట్లను నియంత్రించేందుకు వివిధ దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలను పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఇరాన్–ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు, చైనా–తైవాన్ వివాదాల్లో అమెరికా జోక్యం ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు. యుద్ధాల ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడుతుందని, ఆయుధాల తయారీ, విక్రయాల ద్వారా సామ్రాజ్యవాద దేశాలు లాభపడుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ఫైనాన్స్ కాపిటల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తోందని అన్నారు. కార్మికుల శ్రమతో సృష్టించిన సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు పాలక వర్గాలు దోపిడీ విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అసమానతలు, పేదరికం, నిరుద్యోగం సహజ లక్షణాలుగా ఉంటాయని, ప్రపంచ శాంతి, సమానత్వం, శ్రమకు తగిన ప్రతిఫలం లభించాలంటే సోషలిస్టు వ్యవస్థే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధనకు ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం “కమ్యూనిస్టుల విశిష్టత” అంశంపై సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పి. సోమయ్య తరగతి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజల కోసం త్యాగాలు చేసిన గొప్ప చరిత్ర కమ్యూనిస్టులదేనని అన్నారు. అమెరికాలో కార్మిక హక్కుల కోసం జరిగిన పోరాటాల నుంచి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వరకు కమ్యూనిస్టులు ప్రజల కోసం అసమాన త్యాగాలు చేశారని గుర్తుచేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో భాగంగా కమ్యూనిస్టులు జైలు జీవితం గడిపారని తెలిపారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా దున్నేవాడికే భూమి అనే నినాదంతో భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదేనని అన్నారు. పది లక్షల ఎకరాల భూపంపిణీ, వేలాది గ్రామ స్వరాజ్యాల ఏర్పాటు కమ్యూనిస్టు ఉద్యమాల చారిత్రక విజయాలని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీల బలం ఎన్నికల ఓట్లు, సీట్లలో లేదని, ప్రజా సమస్యలపై నిరంతరం జరిగే పోరాటాల్లోనే ఉందని స్పష్టం చేశారు. గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేసే చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని అన్నారు. పేదరికం, దోపిడీ, సామాజిక అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు కొక్కెరపాటి పుల్లయ్య, ఎం.బి. నర్సారెడ్డి, కె. బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ, దొడ్డ రవి, ఎస్.ఏ. నబి, చిరంజీవి నాయుడు, పిట్టల అర్జున్, మోరంపూడి శ్రీనివాస్, ముదిగొండ రాంబాబు, కొండబోయిన వెంకటేశ్వర్లు, వీర్ల రమేష్, గడ్డం స్వామి, యాసా నరేష్, భూక్య రమేష్, వాంకుడోత్ కోబాల్, సోడే ప్రసాద్, గద్దల శ్రీను, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.