పయనించే సూర్యుడు జూన్ 7 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మండలంలోని ఎరువుల డీలర్లతో వ్యవసాయ శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రైతులకు ఎరువులను నిర్ణీత ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ హెచ్చరించారు. ఎరువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినట్లు గుర్తించిన డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి లైసెన్సులను రద్దు చేసే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కొంతమంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ధరల్లో హెచ్చుతగ్గులు చేస్తూ ఎరువుల విక్రయాలు జరిపితే లైసెన్సు రద్దుతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొనుగోలు సమయంలో రైతులకు ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను గ్రామ గ్రామాన నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణతో పాటు ఏఈవోలు వినీత్, అఖిల్, మండలంలోని ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.