పాలనపై ప్రజల ఆగ్రహంఅక్రమాలపై మౌనం.. అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు

జనం న్యూస్ జూన్ 7 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ప్రభుత్వ వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు జవాబుదారీతనం మరిచి కేవలం జీతాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఫిర్యాదులు వచ్చినా స్పందించకుండా, అధికారాలను అడ్డుపెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలకు కొందరు అధికారులు వేదికలు సిద్ధం చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.మండల వ్యాప్తంగా చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూములపై అక్రమాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయన్న ఆవేదన రైతులు, ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. రైతుల ముసుగులో మట్టి మాఫియా రెచ్చిపోయి చెరువులను తవ్వుతూ, మట్టిని అమ్ముకొని సొమ్ములు చేసుకుంటున్నా చర్యలు కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో మరింత అసహనాన్ని పెంచుతోంది.ప్రజలు కట్టే పన్నుల ద్వారానే జీతాలు తీసుకుంటున్న అధికారులు ప్రజల సమస్యలపై కనీస బాధ్యత చూపకపోవడం సరైన విధానం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. “వచ్చామా.. వెళ్లామా.. జీతాలు తీసుకున్నామా” అన్నట్టుగా కొందరి వ్యవహారశైలి మారిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థ ఎటు పోతే మాకు సంబంధం లేదన్నట్టుగా కొందరు వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది.ఎక్కడ చూసినా నిర్లక్ష్యం, అక్రమాలు, పర్యవేక్షణ లోపాలు కనిపిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజా పాలన నిజంగా ప్రజల కోసమే నడుస్తుందా అనే సందేహాలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు, పాలకులు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారా..? ప్రజల సమస్యలను పట్టించుకోవద్దని సంకేతాలు వెళ్లాయా..? అనే ప్రశ్నలు కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *