భూనిర్వాసితుల హక్కులను కాలరాయొద్దు – మొలుమూరి శ్రీనివాస్

పయనించే సూర్యుడు న్యూస్ రామగిరి, జూన్ 8: రామగిరి మండలంలో సింగరేణి యాజమాన్యం భూనిర్వాసితుల పట్ల అనుసరిస్తున్న వైఖరి నిజాం పాలనను తలపించే విధంగా ఉందని బీజేపీ ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ విమర్శించారు.భూనిర్వాసితులు తమ వ్యక్తిగత అవసరాలు, కూతుళ్ల వివాహాలు, వైద్య చికిత్సలు మరియు ఇతర అత్యవసర ఖర్చుల కోసం తమ ఆస్తులను విక్రయించుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం అన్యాయమన్నారు. కలెక్టర్ ఆదేశాల పేరుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకోవడం అధికారుల నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. సింగరేణికి అవసరమైన భూమిని మాత్రమే స్వాధీనం చేసుకోవాల్సిన చోట, మొత్తం సర్వే నంబర్‌పై ఆంక్షలు విధించడం వల్ల నిరపరాధ భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే గతంలో పునరావాసంలో భాగంగా భూనిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లు, భూములు మరియు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రస్తుతం అడ్డుకోవడం మరింత దురదృష్టకరమని అన్నారు.భూనిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని మొలుమూరి శ్రీనివాస్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సెంటినరీ కాలనీ పట్టణ అధ్యక్షుడు తీగల శ్రీధర్, బీజేపీ సీనియర్ నాయకులు మేరుగు శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *