పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 14 :(సింగరేణి రిపోర్టర్ నరేష్) ఖమ్మం, జూన్ 14: గిరిజన ప్రాంతాల్లో భూ హక్కుల రక్షణ కోసం అమలులో ఉన్న 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ బానోతు లక్ష్మి, తమ భూమి వివాదానికి సంబంధించి కోర్టులు, కమిషన్లు, ప్రభుత్వ శాఖలు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటి అమలులో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన బహిరంగ లేఖలో, తమ కుటుంబానికి చెందిన భూమిని చట్టబద్ధ పత్రాల ఆధారంగా సాగు చేసుకుంటుండగా ప్రత్యర్థులు దౌర్జన్యంగా ప్రవేశించి పామాయిల్ తోట, మిర్చి పంటలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. డ్రిప్ పైపులు, హద్దు రాళ్లు ధ్వంసం చేయడంతో పాటు నాలుగేళ్ల శ్రమను నిమిషాల్లో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించిన పోడు పట్టా, సేత్వార్, స్థల పటాలు, హద్దుల గుర్తింపు పత్రాలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయని, అదే ఆధారంగా ప్రభుత్వం బోరు, మోటారు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, సాగు పైపులు, పామాయిల్ పథకాలు, రుణ సౌకర్యాలు మంజూరు చేసిందని తెలిపారు. అన్ని శాఖలు భూమి తమదేనని గుర్తించినప్పటికీ కోర్టు ఆదేశాల అమలులో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఉపవిభాగ న్యాయస్థానం శాశ్వత నిరోధాజ్ఞలు జారీ చేయడంతో పాటు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించినప్పటికీ స్థానిక అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. హైకోర్టు, జాతీయ గిరిజన కమిషన్, రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి వరకు ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలు కనిపించడం లేదని విమర్శించారు. అదే సమయంలో ప్రత్యర్థి వ్యక్తి రెండు పేర్లతో వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని, ఒక పేరుతో ఉద్యోగం చేస్తూ మరో పేరుతో భూముల వ్యవహారాలు నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై కేసు నమోదై ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న భూ రక్షణ చట్టాలు, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ హక్కులను కాలరాస్తూ అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని ప్రశాంతంగా సాగు చేసుకునేలా వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని, పంట నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. “కోర్టు ఆదేశాలు అమలు కాని రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది?” అనే బానోతు లక్ష్మి ప్రశ్న ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.