అర్థరాత్రి దోపిడీ కలకలం

* కోరపల్లి రోడ్డుపై వాహనం అడ్డగించి దాడి – నగదు, బంగారం దోచుకున్న గ్యాంగ్ అరెస్ట్ * జమ్మికుంట పోలీసుల వేగవంతమైన చర్య * 8 మంది నిందితుల అరెస్ట్ – నగదు, బంగారు ఉంగరం, నాలుగు బైకులు స్వాధీనం

పయనించే సూర్యుడు / మే 23 /దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ / జమ్మికుంట పరిధిలోని కోరపల్లి గ్రామ రోడ్డుపై అర్థరాత్రి చోటుచేసుకున్న దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితులపై దాడి చేసి నగదు, బంగారం, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల ద్వారా డబ్బులు బలవంతంగా వసూలు చేసిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, తేదీ 20-05-2026 రాత్రి సమయంలో కోరపల్లి గ్రామం రోడ్ వైపు నుండి వస్తున్న అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం నెం. టి స్-08-యు డి -5457ను 11 మంది గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. అనంతరం వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డారు. తర్వాత బాధితులను ఎఫ్‌సీఐ గోదాం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరింపులకు గురిచేశారు. నిందితులు బాధితుల వద్ద ఉన్న నగదు, అర తులం బంగారు ఉంగరం దోచుకోవడంతో పాటు ఫోన్‌పే ద్వారా సుమారు రూ.38,000లను బలవంతంగా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా అదనంగా రూ.1 లక్ష ఇవ్వాలని తీవ్ర బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. బాధితులను రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్తున్న సమయంలో వారు గట్టిగా అరవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ప్రజలు చేరుకుంటున్నారని గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. తేదీ 21-05-2026 ఉదయం సైదాబాద్ ఎక్స్ రోడ్ – కోరపల్లి రోడ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో పల్లపు ఈశ్వర్ అలియాస్ బన్నీ, పల్లపు అశోక్, ఎలకపల్లి ప్రమోద్, చొక్కారపు అఖిలేష్, మొగుల్ల రాకేష్, పల్లపు మహేష్ (తండ్రి మల్లయ్య), పల్లపు మహేష్ (తండ్రి రాములు), తపేల వంశీ ఉన్నారు. నిందితుల వద్ద నుండి రూ.14 వేల నగదు, అరతులం బంగారు ఉంగరం, నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత లోని దోపిడీ, అక్రమ నిర్బంధం, బెదిరింపులు, దాడి, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. నిందితులను రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి మీడియాకు వివరాలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *