ఆదేశాలకే పరిమితమైన ముందస్తు జాగ్రత్తలు.

* అందుబాటులో లేని క్షేత్రస్థాయి అధికారులు. * వర్షానికి స్తంభించిన రాకపోకలు.

పయనించే సూర్యుడు మే 3 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్. ఏన్కూరు వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మండలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని ప్రధాన రహదారులతో పాటు వివిధ గ్రామాల్లో పెద్ద వృక్షాలు రోడ్లపై విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విపత్తు సమయాల్లో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఆ చెట్లను తొలగించే నాథుడే కరువై, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలపై ఎన్ని సూచనలు చేసినా, క్షేత్రస్థాయి సిబ్బంది వాటిని బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి, ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శులు, ఇతర సంబంధిత అధికారులు స్థానికంగానే నివసిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *