ఆవు దూడ వంకపై కల్వర్టు నిర్మించాలి: సి.పి.ఐ. డిమాండ్

పయనిoచే సూర్యుడు కర్నూలు జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎర్రకుల మహేష్ ఆదోని పట్టణంలోని 17వ వార్డు ఆర్.ఆర్. లేబర్ కాలనీ సమీపంలోని ఆవు దూడ వంకపై తక్షణమే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) పట్టణ కార్యదర్శి టి. వీరేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం సి.పి.ఐ. నాయకులు ఆవు దూడ వంక ప్రాంతాన్ని సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా టి. వీరేష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో వంకలో నీటి ప్రవాహం పెరగడంతో ఆర్.ఆర్. లేబర్ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, కార్మికులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆవు దూడ వంకపై శాశ్వత ప్రాతిపదికన కల్వర్టు నిర్మించాలని ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం విచారకరమని అన్నారు.అదేవిధంగా ఆర్.ఆర్. లేబర్ కాలనీలో మహిళల కోసం తగిన మరుగుదొడ్లు నిర్మించి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సి.పి.ఐ. పట్టణ సహాయ కార్యదర్శి కె. రమేష్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రంజిత్ గౌడ్, డిహెచ్పిఎస్ నియోజకవర్గ కార్యదర్శి ఏ. విజయ్ కుమార్, అంజి, లింగప్ప తదితర నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *