పయనించే సూర్యుడు న్యూస్ జూలై 10 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. కారుణ్య లక్కీ స్కీమ్ పేరుతో ప్రజలను ఆకర్షించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడు తంగుడు శ్రీధర్‌ను కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.పోలీసుల కథనం ప్రకారం,కరుణ్య లక్కీ స్కీమ్‌లో చేరితే తక్కువ పెట్టుబడితో విలువైన బహుమతులు,నగదు రాబడులు,అధిక లాభాలు వస్తాయని నమ్మించి పలాస, కాశీబుగ్గతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది నుంచి దాదాపు రూ.80 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ప్రారంభంలో కొందరికి బహుమతులు ఇచ్చి విశ్వాసం కల్పించిన నిందితుడు, అనంతరం డబ్బు సేకరించి బాధితులకు అందుబాటులో లేకుండా పోయాడని పోలీసులు తెలిపారు.దీంతో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సేకరించిన ఆధారాల మేరకు ప్రధాన నిందితుడు తంగుడు శ్రీధర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది.ఈ కేసులో మరిన్ని బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు తెలిపారు.ఇలాంటి లక్కీ స్కీమ్‌లు,అధిక లాభాల పేరుతో డబ్బులు వసూలు చేసే వ్యక్తులను నమ్మవద్దని,ఎవరైనా ఈ విధంగా మోసపోయినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.