పయనించే సూర్యుడు న్యూస్, జూలై 7, సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మండలంలోని గుట్ట కింద గుంపు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ నుంచి సీతారాంపురం మీదుగా పొలాలు, గుట్టల గుండా విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో వర్షాలు, ఈదురుగాలులు వచ్చిన ప్రతిసారీ విద్యుత్ వైర్లు తెగిపడి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. దీంతో గ్రామ ప్రజలు తాగునీటి కోసం ఆధారపడే బోర్లకు కూడా విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గ్రామ ప్రజలు గౌరవ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డీఈ వై. రమేష్ కుమార్, ఏడీఈ ఎం.డి. యాసీన్, ఏఈ సీహెచ్ వెంకన్న ప్రత్యేక చొరవతో సీతారాంపురం లాంగ్ ఫీడర్ నుంచి ఉన్న కనెక్షన్‌ను తొలగించి, భాగ్యనగర్ తండా ఫీడర్ నుంచి గుట్ట కింద గుంపు గ్రామం వరకు నాలుగు కొత్త విద్యుత్ స్తంభాల ద్వారా ప్రత్యామ్నాయ కనెక్షన్ ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో విద్యుత్ అంతరాయాలకు చెక్ పడటంతో పాటు తాగునీటి సమస్య కూడా పరిష్కారమైంది. గ్రామ ప్రజలు తమ సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌తో పాటు విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుట్ట కింద గుంపు గ్రామ సర్పంచ్ ఉండం రాఘవులు, జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ షబ్బీర్, ఏఎల్ఎంలు మోహన్, రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.