పయనించే సూర్యుడు జూలై 5 తొర్రూర్ మండలం మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీధర్. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం అణగారిన వర్గాలను, ముఖ్యంగా గిరిజనులను చైతన్యపరుస్తూ పోరాడిన అమరవీరుడు ఠాను నాయక్ త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని తొర్రూరు మండల గిరిజన నాయకుడు జాటోత్ సురేష్ నాయక్ అన్నారు. శుక్రవారం తొర్రూర్ లోనీ ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల హక్కుల సాధన, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల్లో ఠాను నాయక్ ఒకరని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇలాంటి మహనీయుల చరిత్రను భావితరాలకు పరిచయం చేయడం సమాజ బాధ్యత అని, యువత వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని సామాజిక చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన పోరాటంలో గిరిజన యోధుల పాత్రను చరిత్రలో మరింతగా నిలబెట్టే ఉద్దేశంతో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సహకారంతో తొర్రూరులో ఠాను నాయక్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గిరిజన సంఘాల ప్రతినిధులు, మేధావులు, ఉద్యమ కారులు, ప్రజా ప్రతినిధులు, యువత, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని జాటోత్ సురేష్ నాయక్ కోరారు. ఠాను నాయక్ ఆశయాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతూ, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.