జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి

* -పిడిఎస్ యూ జిల్లా సహాయకార్యదర్శి శశి కిరణ్ * విద్యార్థుల హక్కుల సాధనకు ఉద్యమిద్దాం * పాఠశాలను మూసివేతని ఆపాలి * సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

పయనించే సూర్యుడు న్యూస్ :జూలై 9, తల్లాడ రిపోర్టర్ బాబురావు క్రీస్తుజ్యోతి జూనియర్ కళాశాల, తల్లాడ వద్ద విద్యార్థులతో కలిసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న చేపట్టనున్న దేశవ్యాప్త విద్యా బంద్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పిడిఎస్ యూ జిల్లా సహాయకార్యదర్శి గాజుల శశికిరణ్ మాట్లాడుతూ విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేడు తెలంగాణలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలు కొనసాగుతున్నాయనీ, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో వేలాది ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, సరిపడా బోధనా సిబ్బంది లేక విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయనీ, కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను దోచుకుంటున్నాయనీ, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, షూస్, టైలు, బెల్టులు బలవంతంగా విక్రయిస్తూ వేలాది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయనీ, ప్రభుత్వం ఈ దోపిడీని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందనీ, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ, ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, పరిశుభ్రత, భద్రత, తగిన వసతులు కల్పించాలనీ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనీ, ఎన్ఈపీ-2020 పేరుతో విద్యను మరింత కార్పొరేటీకరించే విధానాలను నిలిపివేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *