ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణపై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు8-7-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గొల్లపల్లి మండల కేంద్రంలో ఓటరు నమోదు అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కన్వీనర్ పుప్పాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ద్వారా ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో నవీకరిస్తున్నట్లు తెలిపారు. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారు, తప్పుడు విధానంలో నమోదైన పేర్లు, నకిలీ ఓటర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగిన వారి పేర్లను తొలగించి, 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న అర్హులైన కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చుతున్నట్లు వివరించారు. పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియను ఇప్పటివరకు 11 సార్లు నిర్వహించగా, 2002–2005 మధ్య చివరిసారిగా దేశవ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. గత ఏడాదిలో 13 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం పూర్తయిందని, ప్రస్తుతం దేశంలోని 22 రాష్ట్రాల్లో 1,911 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో సుమారు 4.20 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 37.50 కోట్ల మంది ఓటర్లతో ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో సుమారు 35,907 పోలింగ్ కేంద్రాల పరిధిలో దాదాపు 3 కోట్ల మంది ఓటర్లతో ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చేవులమద్ది శేఖర్, సీనియర్ నాయకులు కట్ట మహేష్, సింహాచలం సత్యనారాయణ, గొల్లపల్లి రాంరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కట్ట క్రాంతి, పట్టణ అధ్యక్షుడు సంగెం కళ్యాణ్, సరసాని అనిల్ రెడ్డి, పోలింగ్ కేంద్ర స్థాయి ప్రతినిధులు గొల్లపల్లి రంజిత్, చేవులమద్ది రాజు, నిశాంత్‌తో పాటు గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *