జనం న్యూస్ 07 జూన్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఆమోదించబడిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అడ్వాన్స్ బ్యూటీషియన్ కోర్స్ షాద్ నగర్ మున్సిపల్ లో ఉన్న ఫరూక్‌నగర్‌లో గత మూడు నెలలుగా విజయవంతంగా కొనసాగుతోంది. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం సెమినా మహిళా సేవా మండలి అధ్యక్షురాలు ఆలియా సుల్తానా ఆధ్వర్యంలో ఫరూక్నగర్ మైనార్టీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కోర్స్‌లో 30 మంది యువతీయులు శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వి. సునీత శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థినులు నేర్చుకున్న నైపుణ్యాలు, వారు నిర్వహించిన ప్రాక్టికల్ పనులు, హెయిర్ స్టైలింగ్ నమూనాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థినులతో మాట్లాడిన కమిషనర్ సునీత మాట్లాడుతూ, ప్రస్తుతం బ్యూటీషియన్ రంగానికి మంచి డిమాండ్ ఉందని, ఈ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధితో పాటు ఉన్నత విద్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. ఉర్దూ మీడియం ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు పై చదువులు కొనసాగించి తమ కాళ్లపై తాము నిలబడాలని ప్రోత్సహించారు. అలాగే సెమినా మహిళా సేవా మండలి అధ్యక్షురాలు ఆలియా సుల్తానాను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గత 15 సంవత్సరాలుగా ఆలియా సుల్తానా సమాజం కోసం, ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలు అందిస్తున్నారు. మీరు కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి మీ వంతు సహాయం అందించే దిశగా ముందుకు సాగాలి అని కమిషనర్ సునీత అన్నారు. తన జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ, నేను కూడా మీలో ఒకదాన్నే. నేడు షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మీరు కూడా నైపుణ్య కోర్సులతో పాటు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలి. సమాజ అభివృద్ధికి మన వంతు సేవ అందించాలి అని విద్యార్థినులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, శిక్షణ పొందుతున్న యువతీయులు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు.