పయనించే సూర్యుడు మే 29 నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు పవిత్ర ఈద్-ఉల్-అదా (బక్రీద్) పర్వదినాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఈద్గా మైదానాలు, మసీదులు ప్రార్థనలతో కళకళలాడాయి. ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించి దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నెలకొనాలని ప్రార్థనలు చేశారు. పర్వదినం సందర్భంగా చిన్నారులు కొత్త దుస్తులు ధరించి సందడి చేయగా, పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈద్గా మైదానాలకు చేరుకుని ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లికంటి మహేష్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రేమ, సహనం, మానవతా విలువలు పెంపొందాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించడం ద్వారానే నిజమైన శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. యువత సోదరభావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకున్నారు.