మురుగునీటి మయం కారేపల్లి.. సమస్య పరిష్కరించకపోతే పోరాటం తప్పదు: డీవైఎఫ్‌ఐ

డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు – ప్రజావాణిలో అధికారులకు వినతి

పయనించే సూర్యుడు న్యూస్, (జూలై 6): సింగరేణి రిపోర్టర్ నరేష్ డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండటంతో కారేపల్లి గ్రామం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని, వెంటనే శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) సింగరేణి మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మండల ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ సింగరేణి మండల కార్యదర్శి ఆదేర్ల వినయ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీటితో పాటు ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదు రోడ్డు, మోడల్ స్కూల్ రోడ్డు, కారేపల్లి బస్టాండ్ సెంటర్, బీసీ కాలనీ, భరత్‌నగర్, అంబేద్కర్‌నగర్ తదితర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలోని ఖాళీ స్థలాలు పిచ్చిమొక్కలతో నిండిపోయి దోమలు, పందులు, వీధి కుక్కలకు నిలయాలుగా మారాయని, దీంతో ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించ డం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి పారిశుధ్య చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. కారేపల్లి గ్రామ అభివృద్ధికి శాశ్వత పరిష్కారంగా సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రజల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా పట్టించుకోవాలని, లేనిపక్షంలో గ్రామ ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆదేర్ల వినయ్ కుమార్ హెచ్చరించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో డీవైఎఫ్‌ఐ మండల నాయకులు గాదె నరేష్, చిలుముల భరత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *