రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ ప్రారంభోత్సవం అనంతరం కలిసి ప్రయాణం

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 9 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట తెలంగాణం నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో తోడ్పడే లక్ష్యంతో కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సహకారంతో, చక్రవర్తి రూపొందించిన రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం కొత్తగూడెం క్లబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు నాణ్యమైన ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్ ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అశ్వారావుపేట బీఆర్ఎస్ నాయకులు కాసాని చంద్రమోహన్ జుజ్జారపు శ్రీరామ్ మూర్తి, సత్యవరపు సంపూర్ణ, మోటూరి మోహన్, జక్కుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కారులో ప్రయాణించిన నాయకులు రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. సరదాగా ముచ్చటిస్తూ ఆప్యాయ వాతావరణంలో ప్రయాణాన్ని కొనసాగించారు. నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక అనుబంధం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉండగా యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలనుకునే నిరుద్యోగ యువతలో ప్రయాణ ఖర్చులు భరించలేని వారికి రాజకీయాలకు అతీతంగా ఉచిత వాహన సౌకర్యం కల్పించనున్నట్లు అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు కాసాని నాగశేషా పద్మ కాసాని చంద్రమోహన్ దంపతులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మండలంలోని ప్రతి నిరుద్యోగ యువకుడు, యువతి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల సాధన దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *