పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 24 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం ఆలూరు గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి జిల్లా తొలి తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని ఆరోపించారు. రైతులు ధర్నా చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదనే సామెతలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో రైతులు పంట పండించడం ఒక ఎత్తయితే, దాన్ని అమ్ముకోవడం మరో ఎత్తుగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకైన రైతును రాజుగా నిలబెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుదేనని, తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారడానికి ఆయన పాలన కారణమని పేర్కొన్నారు.ఎండ తీవ్రత, మరోవైపు కల్లాల్లో నిల్వ ఉన్న వడ్లతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వర్షాలు ముందుగా వచ్చే అవకాశంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. రైతును రాజు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆరోపించారు. రైతుబంధు పూర్తిగా విడుదల కాకపోగా, చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటూ పత్రికా ప్రకటనలు ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరిగేదని, ప్రస్తుతం రైతులను అరిగోశపెడుతున్న నాయకుడు రేవంత్ రెడ్డేనని విమర్శించారు.“ప్రజా పాలన – ప్రగతి పాలన” పేరుతో సంబరాలు చేసుకుంటున్న ప్రభుత్వం, కల్లాల్లో ఉన్న వడ్లు కొనుగోలు చేయకపోవడమేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రజాపాలన పేరిట దరఖాస్తులతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మోద్దునిద్ర వీడి ఎక్కడ ధాన్యం నిల్వ ఉందో అక్కడ వెంటనే కొనుగోలు పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బర్కాం మల్లేష్, ఆనంద్ రావు, సుధాకర్, పాక్స్ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్లు స్వామిరెడ్డి, గంగాధర్, నాయకులు ఎండీ చాంద్, మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఆడెపు కృష్ణ, నందు నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.