రైతులకు,కార్మికులకు బకాయిలను తక్షణమే చెల్లించాలి.

పయనించే సూర్యుడు చోడవరం మండలం అనకాపల్లి జిల్లా జూన్ 15, బుధవారం నాడు రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్)-ఏఐఎఫ్టీయూ న్యూ ల ఆధ్వర్యంలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగే చెరుకు రైతులు ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, ఈరోజు చోడవరంలోని తామరచెరువు వీధి పాల కేంద్రం వద్ద రైతులతో ధర్నాకు సంబంధించిన “గోడ పత్రిక”ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రైతుకూలీసంఘం (ఆంధ్రప్రదేశ్) జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు మాట్లాడుతూ, “గోవాడ సుగర్ ఫ్యాక్టరీ 2024-25 సీజన్లో చెరుకు తోలిన రైతులకు నేటికీ 29 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించలేదని,దీనివలన అప్పులు తెచ్చి, పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అలాగే ఈ సీజన్లో(2025-26) ఫ్యాక్టరీని క్రషింగ్ నిలిపివేయడంతో, చెరుకు పంట కనుమరుగై, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలలో వేలాది మంది రైతులు,రైతు కూలీల జీవనోపాధి దెబ్బతిన్నదని, స్థానిక ప్రజలు, వ్యాపారవర్గాలు ఆదాయాలు కూడా తగ్గిపోయాయని, ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామపంచాయతీ లలో ఆదాయం కూడా తీవ్రంగా పడిపోయిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధికి,వ్యవసాయానికి వ్యవసాయ ఆధారత పరిశ్రమలు చాలా కీలకమైనవని, అటువంటి పరిశ్రమలను దివాలా తీయించి మూసివేయడం సరైనది కాదని, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై,సభ్య రైతుల హక్కులకు నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ‘మహాజన సభ’ నిర్వహించాలని,పిపిపి విధానంలో ఫ్యాక్టరీని ప్రైవేటుకు అప్పగించే ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సర కాలం అంతా రైతులకు, కార్మికులకు రావలసిన బకాయిల కోసం, ఫ్యాక్టరీలో క్రషింగ్ మరలా ప్రారంభించాలని, ఫ్యాక్టరీని ఆధునికరించాలని డిమాండ్ చేస్తూ అనేకసార్లు రైతు,కార్మిక సంఘాలు, అఖిలపక్ష పార్టీల తరఫున ఆందోళనలు చేయడం జరిగింది. ప్రత్యేకించి, జనవరి నెలలో 23 రోజులు పాటు ఫ్యాక్టరీ గేటు వద్ద నిరసన దీక్షలు నిర్వహించగా, 24వ తేదీన రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వచ్చి, రైతులకు, కార్మికులకు బకాయిలను నెలరోజుల్లోగా చెల్లించేందుకు, ముఖ్యమంత్రి గారితో చర్చించి ఫ్యాక్టరీ అభివృద్ధిపై నిర్ణయం తీసుకుంటామని పత్రికా ముఖంగా హామీలు ఇచ్చారు.కానీ ఐదు నెలలు గడుస్తున్నా, ఈ హామీలు నేటికీ నెరవేర్చలేదు, దీనికి నిరసనగా జరుగుతున్న చెరుకు రైతుల ధర్నాలో సభ్య రైతులంతా పాల్గొని, పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూన్యూ జిల్లా నాయకులు అయితిరెడ్డి అప్పలనాయుడు, ఎన్ వై ఎస్ జిల్లా కన్వీనర్, నందారపు భాస్కరరావు, చెరుకు రైతులు సబ్బవరపు రామునాయుడు, ఈర్లి సాంబశివరావు తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *