వడదెబ్బకు గురైన గుర్రం అప్పన్న కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో చెల్లించాలి.పనివేళలు మార్చాలి సిఐటియు డిమాండ్..

పయనించే సూర్యుడు మే 24, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్, మే 22 – 2026: కాకినాడ రూరల్ సర్పవరం గ్రామ పంచాయతీలో పారిశుద్య కార్మికుడిగా పనిచేస్తున్న గుర్రం అప్పన్న (38) శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పని చేస్తుండగా తీవ్రమైన వడదెబ్బకు గురై ప్రభుత్వం ఆసుపత్రిలో మరణించాడు. తీవ్ర వడగాల్పుల కారణంగా ఉదయం 11 గంటల నుండి ప్రజలు బయట తిరగవద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియూ సంబంధిత అధికారులు ప్రకటనలు చేస్తున్నా , కార్యదర్శి దృష్టికి కార్మికుల తమ ఇబ్బందులు చెప్పుకుంటున్నా సర్పవరం గ్రామపంచాయతీలో జాగ్రత్తలు తీసుకోక పోవడం వలనే గుర్రం అప్పన్న బలి అయ్యాడని అధికారులు దీనికి పూర్తి బాధ్యత వహించాలని పంచాయతీ యూనియన్ కార్యదర్శి సి హెచ్ అజయ్ కుమార్, సి ఐ టి యి రూరల్ కార్యదర్శి టి రాజాలు డిమాండ్ చేశారు. అనాధ అయిన అప్పన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని నాయకులు కోరారు. ఈవడగాల్పులు, తీవ్రమైన ఎండల్లో కార్మికులు చేసే పనిని ఉదయాన్నే పని చేసేటట్లు సమయాన్ని మార్చాలని , ఇది అన్ని పంచాయతీల్లో అమలు జరిగేటట్లు కలెక్టర్ తగు ఆదేశాలు ఇవ్వాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. గుర్రం అప్పన్నకు భార్య నాగమణి (30) ఇద్దరు పిల్లలు అపర్ణ (16), శివదుర్గ(13)లు ఉన్నారు, పిల్లలు చదువుతున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వం నుండి అందే ఎక్స్ గ్రేషియో చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, చదువుతున్న పిల్లలను ప్రభుత్వం చదివించాలని అజయ్ కుమార్ కోరారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూడాలని, కార్మికుల భద్రత, సంక్షేమానికి అన్ని చర్యలూ వెంటనే తీసుకోవాలని యూనియన్ కోరుతున్నదని అజయ్ కుమార్ తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *