వికలాంగ యువకుడి ఆవేదనకు అండగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ – ఉపాధి కల్పనకు అధికారులకు ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 4:( సింగరేణి రిపోర్టర్ నరేష్) ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సింగరేణి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మండల సీనియర్ నాయకుడు దారావత్ భద్రు నివాసానికి తేనీటి విందుకు విచ్చేసిన ఎమ్మెల్యేను కలిసేందుకు పొలంపల్లి గ్రామానికి చెందిన ఓ వికలాంగ యువకుడు వచ్చాడు. ఈ సందర్భంగా తన కుటుంబ పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి లేక జీవనం సాగించడంలో పడుతున్న కష్టాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చాడు. యువకుడు అందజేసిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే స్వయంగా చదివి, అందులో పేర్కొన్న సమస్యలను సవివరంగా తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాన్ని కల్పించాలని కోరిన యువకుడి విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మండల అధికారులకు ఆ లేఖను సిఫారసు చేశారు. అదేవిధంగా బ్యాంకు ద్వారా స్వయం ఉపాధికి ఉపయోగపడే ఏదైనా యూనిట్ మంజూరు చేసి, వికలాంగ యువకుడు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, వెంటనే స్పందించి పరిష్కార మార్గాలు చూపడం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రత్యేకత అని స్థానికులు పేర్కొన్నారు. తన బాధలను శ్రద్ధగా ఆలకించి, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు ఆ వికలాంగ యువకుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. ఎమ్మెల్యే చూపిన చొరవ పట్ల గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజా సమస్యలపై ఆయన స్పందన అభినందనీయమని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *