పయనించే సూర్యుడు జూలై 8, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వలసపాకల గంగరాజు నగర్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనసేన పార్టీ రెండో అధ్యాయం ప్రారంభమైందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మంది నాయకులు పార్టీలో చేరనున్నారని ప్రకటించారు. ప్రజల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న శక్తులన్నీ జనసేన వైపు చూస్తున్నాయని అన్నారు. ‘రావణ్’ పేరుతో సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లు, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ, కులాలు–మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా ఇదే విషయాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడంపై కూడా నానాజీ స్పందించారు. పార్టీ గుర్తుపై పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతోనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.