పయనించే సూర్యుడు / మే 30 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ పార్లమెంట్ పీసీసీ సమన్వయకర్త కూన శ్రీశైలం గౌడ్‌కు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ, సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ముఖ్యంగా పోలింగ్ బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ఇంటింటికీ తీసుకెళ్లేలా నాయకులు పనిచేయాలని కోరారు. దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, ప్రజలపై పడుతున్న ప్రభావం గురించి వాడవాడనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి సామాన్యుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందన్నారు. ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెంచేందుకు నాయకులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత, ధర్మకర్త గొడిశాల పరమేష్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.