సామినేని రామారావు హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఎం రాష్ట్ర బృందం వినతి ..

పయనించే సూర్యుడు మే 26, (చింతకాని మండలం రిపోర్టర్). చింతకాని మండలంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కోరింది. సోమవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జగ్గుల జాన్ వెస్లీ ఆధ్వర్యంలో రాష్ట్ర బృందం, జిల్లా నాయకత్వం మరియు సామినేని రామారావు సతీమణి సామినేని స్వరాజ్యం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సిపిఎం నేతలు తెలిపారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, పాతర్లపాడు గ్రామానికి చెందిన సామినేని రామారావును 2025 అక్టోబర్ 31న రాజకీయ కక్షతో బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కాండ్ర పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లు తదితరులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. రామారావు జీవించి ఉంటే గ్రామంలో సిపిఎంను ఓడించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో కుట్ర పన్ని హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రామారావు హత్య జరిగి ఏడు నెలలు గడిచినా ఇప్పటివరకు నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగిన సమయంలో తన భర్తను హత్య చేసిన వారిని స్వయంగా చూసి వారి పేర్లతో సహా చింతకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని సామినేని స్వరాజ్యం పేర్కొన్నట్లు తెలిపారు. సామినేని రామారావు నిస్వార్థ ప్రజానాయకుడిగా ప్రజల్లో విశేష గుర్తింపు పొందారని, పాతర్లపాడు గ్రామానికి రెండుసార్లు ఏకగ్రీవ సర్పంచ్‌గా పనిచేశారని తెలిపారు. ఆయన సతీమణి స్వరాజ్యం కూడా ఒకసారి సర్పంచ్‌గా సేవలందించినట్లు వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంచడం, రైతులు మరియు కార్మికుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించడం ద్వారా ప్రజా నాయకుడిగా నిలిచారని కొనియాడారు. రామారావు సుమారు 50 సంవత్సరాల పాటు సిపిఎం మరియు ప్రజా సంఘాల్లో పనిచేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆయనను సహించలేని సంఘ విద్రోహ శక్తులు కుట్ర పన్ని హత్య చేశాయని ఆరోపించారు. ఈ వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టీ జ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, మల్లు లక్ష్మి, తీగల సాగర్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *