సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: పాలెం బ్యాంక్ మేనేజర్ శ్రవణ్

యాప్‌లు డౌన్‌లోడ్ చేయొద్దు.. OTPలు ఎవరికీ చెప్పొద్దని ఖాతాదారులకు సూచన

పయనించే సూర్యుడు జులై 8 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని యూనియన్ బ్యాంక్ పాలెం శాఖ మేనేజర్ శ్రవణ్ సూచించారు. బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి యాప్‌లు డౌన్‌లోడ్ చేయమని చెప్పినా, ఖాతా అప్‌డేట్ పేరుతో వ్యక్తిగత వివరాలు అడిగినా నమ్మవద్దని హెచ్చరించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే లక్కీ డ్రా, రుణాలు, బహుమతుల పేరుతో పంపే లింక్‌లపై క్లిక్ చేయవద్దని, అవి బ్యాంక్ ఖాతాల్లోని నగదును దోచుకునే ఉద్దేశంతో పంపుతున్నవేనని తెలిపారు. అలాగే బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ OTPలు, PINలు, CVV వంటి వివరాలను అడగరని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ వాటిని చెప్పవద్దని స్పష్టం చేశారు. అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని గ్రామీణ ప్రాంత ప్రజలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని, అప్రమత్తంగా ఉంటేనే మోసాలను నివారించవచ్చని అన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని లేదా సమీప బ్యాంకు శాఖను సంప్రదించాలని మేనేజర్ శ్రవణ్ సూచించారు. ఆధునిక బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తూనే భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *