జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలపై నిరసన: ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు, జూలై 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ ప్రభుత్వ వైద్యశాలలో దీర్ఘకాలంగా నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని సందర్శించిన భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు అక్కడ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్థానిక ఇన్‌చార్జ్ వైద్యుడు కిరణ్ ను కలిసి సమస్యలను వివరించేందుకు ప్రయత్నించారు. అయితే సదరు ఇన్‌చార్జ్ వైద్యుడు తన చాంబర్ లో అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ మరియు అధికారుల నిర్లక్ష్య శైలికి నిరసనగా అక్కడి ఖాళీ కుర్చీకే తమ వినతిపత్రాన్ని అందజేసి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో స్థానిక ఆసుపత్రి యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి జహీరాబాద్ ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతులను కల్పించాలని మరియు అందుబాటులో ఉంటూ రోగులకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *