పయనించే సూర్యుడు జులై 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆధార్ కార్డు అప్డేట్, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. “రూ.5 లక్షల రుణానికి అర్హులు” వంటి తప్పుడు ఆఫర్లతో ప్రజలను వలలో వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నిరక్షరాస్యులతో పాటు చదువుకున్న వారూ ఈ మోసాల బారిన పడుతున్నారు. తాజాగా ఆదివారం బిజినపల్లి మండలానికి చెందిన మాజీ సర్పంచ్ దేవరకొండ రామ్‌చందర్ యూనియన్ బ్యాంక్ పాలెం ఖాతా నుంచి ఆయనకు తెలియకుండానే రూ. 91, వేల800 వందలు పైగా నగదు విత్‌డ్రా అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా, మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అరికట్టడం సాధ్యమని అధికారులు తెలిపారు.