స్నేహమంటే ‘మాది’రా.. మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన 2002 టెన్త్ బ్యాచ్

పయనించే సూర్యుడు జూలై 10 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు తుడిచేవాడే నిజమైన స్నేహితుడని, స్నేహం కేవలం కలిసి చదువుకోవడానికే పరిమితం కాదని నిరూపించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన 2002 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు. ఇటీవల అకాల మరణం చెందిన తమ తోటి స్నేహితుడు ఎన్మంగండ్ల మల్లేష్ కుటుంబానికి తామంతా ఉన్నామంటూ అండగా నిలిచి సమాజానికి ఒక గొప్ప ఆదర్శవంతమైన సందేశాన్ని ఇచ్చారు.గత ఆరేళ్ల క్రితమే మల్లేష్ భార్య చనిపోగా, ఇప్పుడు మల్లేష్ కూడా అకాల మరణం చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం మల్లేష్‌కు ఇద్దరు మగపిల్లలు, వృద్ధురాలైన తల్లి మాత్రమే మిగిలారు. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలైన ఆ పిల్లల దీనస్థితి, వృద్ధురాలైన ఆ తల్లి బాధ తోటి స్నేహితులను కదిలించింది.మిత్రుడి కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో 2002 పదో తరగతి బ్యాచ్ క్లాస్‌మేట్స్ అందరూ ఒకతాటిపైకి వచ్చారు. తమలో ఒకరైన మల్లేష్ జ్ఞాపకార్థం, అతని పిల్లల భవిష్యత్తు కోసం మిత్రులంతా కలిసి తమకు తోచిన విధంగా కొంత నగదును సేకరించారు. ఆ మొత్తాన్ని మల్లేష్ తల్లి, పిల్లలకు అందజేసి వారిలో ధైర్యాన్ని నింపారు. స్నేహితులంటే కేవలం సంతోషాలను పంచుకునేవారు మాత్రమే కాదు, కష్ట కాలంలో కొండంత అండగా నిలబడేవారని ఈ బ్యాచ్ మిత్రులు నిరూపించారు.ఈ విపత్కర కాలంలో స్పందించి, మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్క క్లాస్‌మేట్‌కు, తోటి సన్నిహితులకు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్నేహితుల బంధం ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *