పయనించేసూర్యుడు మే 28 రాజేష్ దౌల్తాబాద్ ) సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీప రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం రైతులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. గత రాత్రి కురిసిన వర్షాలకు పెద్ద మొత్తంలో వడ్లు తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితమే కోతలు పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదని రైతులు మండిపడ్డారు. రైతుల కథనం ప్రకారం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు కనీసం ఒక్క లారీ కూడా పం పించలేదని, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వడ్లను ట్రాక్టర్లలో నింపుకొని మిల్లర్ల వద్దకు తీసుకెళ్లినా, మిల్లర్లు ధాన్యాన్ని స్వీకరించడం లేదని రైతులు వాపోయారు. కొనుగోలు వ్యవస్థలో సమన్వయం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాలతో తడిసిన ధాన్యం కారణంగా పెట్టిన ఖర్చు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రైతుల పట్ల ప్రభుత్వం కనీస కనికరం చూపడం లేదని, చేతకాని పాలన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతుల పట్ల ప్రేమ చూపించిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతులు రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టడంతో దాదాపు గంటసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మార్వో కృష్ణ మోహన్, సిఐ .షేక్ లతీఫ్, స్థానిక ఎస్సై.మానస సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. తక్షణమే వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతులు తమ ధర్నాను విరమించారు. అయితే వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా కలిసి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించి, కొనుగోలు కేంద్రాల్లో వేగవంతమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.