కుక్కునూరు పరిధిలో సున్నిత ప్రాంతాల పరిశీలన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు పటిష్టం చేయాలి అని పోలవరం డీఎస్పీ యు రవి చంద్ర

🖨️ Print

పయనించే సూర్యడు న్యూస్ కుక్కునూరు నవంబర్ 02 ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలవరం డీఎస్పీ కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నితమైన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షిస్తూ, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
అనంతరం సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశమైన డీఎస్పీ ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాల నిర్వహణపై చర్చించారు. అవసరమైన ప్రాంతాల్లో తగిన సంఖ్యలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రతి అంశంలో అప్రమత్తత పాటించాలని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగైన ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *